Telangana | నర్సాపూర్, అశ్వారావుపేట, మాల్, మే 16: అంతకుమునుపు ఎండిన పంటలు.. మొన్న అకాల వర్షం.. నిన్న అందని సర్కారు సాయం.. ఇలా రైతులపై ఒక్కో సమస్య బుసలు కొట్టగా, ఇప్పుడు లంచం కూడా పడగ విప్పింది. గురువారం ఒక్కరోజే ముగ్గురు అధికారులు లంచం తీసుకొంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మెదక్ జిల్లాలో ఓ వ్యవసాయాధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో డిస్కమ్ ఏఈ, నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఆర్టిజన్ గ్రేడ్-2 ఉద్యోగి.. రైతుల వద్ద లంచం తీసుకొంటూ అడ్డంగా దొరికారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కే సుదర్శన్ వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరాక్యాంప్కు చెందిన రైతు వంగా నరేశ్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి, ట్రేడ్ లైసెన్స్ జారీ కోసం.. శివశక్తి ఆగ్రో ఏజెన్సీస్ నర్సాపూర్ పేరుతో ఫార్వర్డ్ చేయటానికి ఏవో అనిల్‌కుమార్‌ను సంప్రదించాడు. దీనికి ఏవో లంచం డిమాండ్ చేయటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు ఏవోకు రూ.30 వేలు ఇస్తుండగా గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మరో ఘటనలో ఏపీలోని జంగారెడ్డిగూడేనికి చెందిన కొనకళ్ల జనార్దన్‌రావుకు అశ్వారావుపేట మండలం మద్దికొండలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ భూమికి విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు కనెక్షన్ కోసం జనార్దన్‌రావు కుమారుడు ఆదిత్య.. అశ్వారావుపేట డిస్కమ్ ఏఈ శరత్‌ను సంప్రదించాడు. ఆయన సూచన మేరకు మీ సేవ కేంద్రంలో నెల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకయ్యే ఖర్చు రూ.1.81 లక్షల ఎస్టిమేషన్ రుసుమును కూడా డీడీ రూపంలో చెల్లించాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం, విద్యుత్ కనెక్షన్ కోసం మరో రూ.లక్ష ఇవ్వాలని శరత్ లంచం డిమాండ్ చేయటంతో బాధితుడు ఏసీబీని సంప్రదించాడు. దీంతో లక్ష్మీతులసి పేపర్‌మిల్లు సమీపంలో ఆదిత్య నుంచి ఏఈ శరత్ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇంకో ఘటనలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన రైతు సూర్యనారాయణ తన వ్యవసాయ బావికి, ఇంటికి విద్యుత్తు కనెక్షన్ కోసం 2022లో డీడీలు కట్టాడు. విద్యుత్తు సిబ్బంది ఇంటికి మీటర్ పెట్టి, పొలంలో స్తంభాలు నాటారు కానీ విద్యుత్తు కనెక్షన్ ఇవ్వలేదు. కనెక్షన్ కోసం ఏడాదిగా కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. లైన్ వేసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని ఆర్టిజన్ ఉద్యోగి వేణుకుమార్ డిమాండ్ చేశాడు. దాంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు చెప్పిన ప్రకారం మొదటి విడతగా రూ.20 వేలు ఇచ్చేందుకు ఉద్యోగి వేణుకుమార్తో ఒప్పందం చేసుకున్నాడు. గురువారం చింతపల్లిలోని సాయిబాబా ఆలయం వద్ద రైతు నుంచి ఆ ఉద్యోగి రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, కేసు నమోదు చేశారు.