కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 3: పహాణీ నకల్ కోసం రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్‌తోపాటు ఆయన డ్రైవర్, ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. ఓదెల మండలం కొమిరె గ్రామానికి చెందిన కాడం తిరుపతి, ఆయన తండ్రి మల్లయ్యకు కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్ల గ్రామ శివారులోని సర్వేనెంబర్ 645లో 28 గుంటల భూమి ఉంది.
ఈ భూమి మీద బ్యాంక్ లోన్ తీసుకోవడం కోసం లింక్ డాక్యుమెంట్(పహాణీ నకల్) అవసరం కావడంతో తహసీల్దార్ జాహెద్పాషాను సంప్రదించాడు. పహాణీ నకల్ కావాలంటే రూ.10 వేలు లంచం ఇస్తేనే ఇస్తానని తహసీల్దార్ చెప్పడంతో తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ప్లాన్ ప్రకారం.. తహసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ జాహెద్‌పాషా, చిన్నరాత్‌పల్లి వీఆర్ఏ దాసరి మల్లేశం కొడుకు దాసరి ధర్మేందర్ (విష్టు), డ్రైవర్ అమ్జద్‌పాషా రైతు తిరుపతి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితులను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు.
గతంలో ఈ భూమి మ్యుటేషన్ సమయంలో కూడా ఇదే తహసీల్దార్ తనను నానా ఇబ్బందులకు గురిచేశాడని ఆవేదన వ్యక్తంచేశాడు. పాస్బుక్కు కోసం రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి.. ఒకసారి రూ.15 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు తీసుకుని పనిచేయలేదని వాపోయాడు. చివరికి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే.. మ్యుటేషన్ అయ్యి పాస్బుక్కు వచ్చిందని తిరుపతి వివరించాడు.