కంది, ఆగస్టు 2: సంగారెడ్డి జిల్లా కందిలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. గురువారం సాయం త్రం 6 నుంచి శుక్రవారం ఉదయం 6 వరకు సుమారు 12 గంటలపాటు సోదాలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులను ఉదయం 6 గంటల వరకు బయటకు వెళ్లనీయకుండా విచారణ చేపట్టారు. భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏమైనా అవకతవకలు జరిగా యా? అన్న కోణంలో దర్యాప్తు చేసేందుకు గురువారం జరిగిన 56 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తీసుకెళ్లారు. ఇవే కాకుండా కొద్దిరోజులుగా జరిగిన రిజిస్ట్రేషన్ల డాటా తీసుకెళ్లినట్టు సమాచారం.
ఏసీబీ అధికారులు రావడాన్ని గమనించి కిటికిలోంచి రూ.లక్ష బయ ట పడేయడంతో ఆ నగదును స్వాధీ నం చేసుకొన్న అధికారులు, డబ్బులు విసిరేసింది ఎవరన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అనుమానం ఉన్న పలు పత్రాలను తీసుకెళ్లారు. సోదాలకు సంబంధించి ఎలాంటి రిపోర్టును ఏసీబీ అధికారులు ప్రకటించలేదు. కాగా, ఏసీబీ తనిఖీలకు భయపడి ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడం చర్చనీయాంశగా మారింది.
శుక్రవారం మధ్యా హ్నం 12.30 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న ఏ ఒక్క కౌంటర్ తెరుచుకోలేదు. రిజిస్ట్రేషన్లు జరగవనే ప్రచారం జరిగింది. కందిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్ను బట్టి బేరసారాలు నడుస్తున్నట్టు సమాచారం. ఈ క్రమం లో ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ రైటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలుస్తున్నది. డాక్యుమెంట్ రైటర్ల షాపులు కూడా మూసిఉండటంతో రిజిస్ట్రేషన్ ఆఫీసు జనాల్లేక వెలవెలబోయింది.