హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): విచారణ పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కాదు, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లను సైతం కాంగ్రెస్ సర్కార్ వేధించింది. రేవంత్రెడ్డి సర్కార్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ మార్చిలో నివేదిక సమర్పించింది. 17 మంది ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై క్రిమినల్ ప్రొసీడింగ్స్, మరో 40 మంది ఇంజినీర్లపై మేజర్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ చేపట్టాలని నివేదించింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇంజినీర్లపై చర్యలు తీసుకొనేందుకు సిద్ధపడింది. ఆ ఇంజినీర్లు అందరిపై కాకుండా మొత్తంగా 38 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిర్బంధం తరహాలో విచారణ కొనసాగించిందని ఇంజినీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విచారణకు పిలిచి అప్పటికప్పుడే సమాధానాలివ్వాలని ఒత్తిడి చేసింది. డాక్యుమెంట్లు ఇచ్చేందుకు సమయమివ్వకుండా, ఏది ఉంటే అదే రాసివ్వాలని, కేవలం అభియోగాలు మోపడమే లక్ష్యంగా విచారణ నిర్వహించారని ఇంజినీర్లు చెప్తున్నారు.
ఇంజినీర్లపై కక్ష సాధింపు చర్యలు
కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన పలువురు ఇంజినీర్లపై ఏసీబీ దాడులు సైతం చేయించింది. ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ప్రచారం చేసేందుకు, అవినీతి మరకలు అంటించేందుకు పూనుకున్నది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేరిట ఇంజినీర్లను విచారించింది. విశ్రాంత ఇంజినీర్లు, గతంలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులనూ ఇరికించేందుకు య త్నించింది. నిరాధార ఆరోపణలు చే స్తూ కేసులు బనాయించింది. విచా రణలతో మానసిక వేదనకు గురిచేసింది.