ACB | తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాలోని ఆర్టీవో కార్యాలయాలు, సరిహద్దుల్లోని చెక్పోస్టులపై ఏక కాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని ఉప్పల్, తిరుమలగిరి, కామారెడ్డి పెద్దపల్లి జిల్లాల్లోని రోడ్డు రవాణాశాఖ కార్యాలయాలను కలుపుకుని ఏకంగా 18 ఆఫీసులపై మూకుమ్మడిగా అధికారులు దాడులు చేశారు. ఈ మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు తొత్తులుగా మారిన ఆర్టీవో ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయాలపై ఏసీబీ అధికారుల మెరుపు దాడులు చేశారు. ఏకంగా కార్యాలయం గేట్ మూసివేసి తిరుమలగిరిలో 10, ఉప్పల్లోమరో 10 మంది ఆర్టీవో ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరిణామంతో ఆర్టీవో కార్యాలయం పరిధిలో అప్పటి వరకు గుమిగూడిన ఏజెంట్లు అంతా.. అక్కడి నుంచి పరారయ్యారు. ఇక అయితే, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వాహనదారులు ఆకస్మిక ఏసీబీ రెయిడ్స్ కారణంగా కార్యాలయం ఎదుట వారు గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు.