హైదరాబాద్, డిసెంబర్26(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారం బంజారా ఉద్యోగులపై ఏసీబీతో దాడులు చేయిస్తూ, అణచివేతకు పాల్పడుతున్నదని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌సింగ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. వరుసగా జరుగుతున్న దాడులతో తమ జాతి ఉద్యోగులు భయకంపితులవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కష్టపడి పనిచేసే, ఉన్నత స్వభావం కలిగిన బంజారా ఉద్యోగులపై కుట్రపూరితంగా ఆరోపణలు మోపుతూ వారి పరువు ప్రతిష్ఠలను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
వారసత్వంగా వచ్చిన భూములు, ఉద్యోగ ఆరంభ దశలో వేల రూపాయలతో కొనుగోలు చేసిన ప్లాట్లు లేదా భూములు ఈ రోజు రూ.కోట్ల విలువకు చేరుకున్నాయన్న సహజ ఆర్థిక వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, వాటిని అవినీతి ఆస్తులుగా చిత్రీకరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగి డబ్బులు తీసుకుంటున్న సమయంలో పట్టుకొని చర్యలు తీసుకోవడం ఏసీబీ విధి అని, కానీ కేవలం ఆస్తులున్నాయన్న కారణంతో ఇండ్లపై దాడులు చేసి కుటుంబసభ్యుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం న్యాయసమ్మతం కాదన్నారు. బంజారా సమాజాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలను ఐకమత్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.