నిజామాబాద్ / సూర్యపేట : లంచాల పేరిట వేధింపులకు గురిచేయడాన్ని సహించలేక పోతున్న బాధితుల ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు దాడులను ( ACB Raids ) ముమ్మరం చేస్తున్నారు. ఇటీవల వరుసగా రెడ్ హ్యండెడ్గా పట్టుబడుతున్న అధికారుల జాబితాలోనే గురువారం రెండు జిల్లాలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా ఆర్మూర్ పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గుర్రం వివేకానందా రెడ్డి ( MVI Vivekananda Reddy ), అతడి ప్రైవేట్ డ్రైవర్ నెల్లి తిరుపతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వాహనాల రిజిస్ట్రేషన్ల పునరుద్దరణతో పాటు భవిష్యత్లో ఎలాంటి అనుమతులు కావాలన్న లంచం ఇవ్వాల్సిందేనని ఇద్దరు మొండికేయడంతో చివరకు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ గురువారం ఇద్దరిని పట్టుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
సూర్యాపేట లో..
సూర్యాపేట ( Suryapeta) జిల్లా పాలకీడు మండలం జన్పాహడ్ గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీ ( Panchayat Secretary ) ఇంజమూరి వెంకయ్య రూ. 20 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మొదటి విడత నిధుల విడుదల, రెండవ విడత కోసం సెక్రటరీ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా పథకం ప్రకారం దాడులు నిర్వహించి పట్టుకున్నారు. సెక్రటరీ నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.