హైదరాబాద్, జగిత్యాల, సుబేదారి, ఫిబ్రవరి 7 (నమస్తేతెలంగాణ): హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అక్రమాస్తులు కలిగి ఉన్నారని గత కొంతకాలంగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్లోని శ్రీనివాస్ ఇంటితోపాటు వరంగల్, కరీంనగర్, జగిత్యాల తదితర ప్రాంతాల్లోని బంధువుల ఇండ్లలోనూ సోదాలు జరిపారు.
మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు, జగిత్యాల, కరీంనగర్, వరంగల్లో భూములు, బ్యాంకు అకౌంట్లలో నగదు, విలువైన బంగారు ఆభరణాలను గుర్తించారు. అక్రమాస్తులు రూ.50 కోట్లకుపైగానే ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. పూర్తి లెక్కలు తేలితే ఆస్తుల విలువ మరింత పెరుగొచ్చు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.