వరంగల్/ వికరాబాద్ : అవినీతి అధికారులు రోజుకో జిల్లాలో పట్టుబడుతున్నారు. వరంగల్( Warangal), వికరాబాద్ ( Vikarabad ) జిల్లాలో ఒకేరోజు నలుగురు అధికారులు ఏసీబీ ( ACB ) అధికారులకు శుక్రవారం రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికారి అల్లు నాగమణి రూ.70 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక అధికారులు పట్టుకున్నారు.
మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 84 మంది కొత్త సభ్యుల సభ్యత్వం కోసం లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు అధికారులను ఆశ్రయించగా నాగమణితో పాటు ఫీల్డ్ ఆఫీసర్ పెద్దబోయిన హరీష్‌ను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని వరంగల్ ఏసీబీలో కోర్టులో ప్రవేశపెట్టారు.
వికరాబాద్ జిల్లాలో
అదేవిధంగా వికరాబాద్ జిల్లా పరిగి అటవీ రేంజ్ పరిధిలో పనిచేస్తున్న ఫారెస్టు సెక్షన్ అధికారులు బొల్లుమల్ల సాయికుమార్, మహ్మద్ మొయినొద్దీన్, డ్రైవర్ బాలనగరం బాలకృష్ణ రూ. 30 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అటవీ నుంచి సీతాఫలాల రవాణా అనుమతి కోసం బాధితుడు సంప్రదించగా అధికారులు డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు శుక్రవారం లంచం తీసుకుంటుండగా ముగ్గురిని పట్టుకుని కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు.