లక్ష్మీదేవిపల్లి, నవంబర్ 5 : విద్యుత్తు మీటర్ ఎన్వోసీ కోసం రూ.20 వేలు డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ కథనం ప్రకారం.. రేగళ్ల పెద్దతండాకు చెందిన భూక్యా లక్ష్మా విద్యుత్తు మీటర్ కోసం ఎన్వోసీ కావాలని రేగళ్ల పంచాయతీ కార్యదర్శి కాంపాటి పుల్లయ్యకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం కార్యదర్శి రూ.20 వేలు డిమాండ్ చేశాడు. సదరు బాధితుడు అంత డబ్బు ఇవ్వలేనని చెప్పి అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు సూచన మేరకు బాధితుడు లక్ష్మా.. పంచాయతీ కార్యదర్శిని కలువగా అప్పుడు కూడా డబ్బులు డిమాండ్ చేయగా.. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కార్యదర్శి పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు.