సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 14: రాజన్న సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్, అసిస్టెంట్ సర్వేయర్లు ఏసీబీకి చిక్కారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ వివరాలు తెలిపిన ప్రకారం.. సిరిసిల్లకు చెందిన ఇరుకుల్ల ప్రవీణ్‌కు 10వ వార్డు పరిధిలో ఉన్న మూడెకరాల ల్యాండ్ సర్వే కోసం సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. సర్వే చేయాలని సర్వేయర్ వేణుగోపాల్ కోరగా రూ.50వేలు ఇస్తేనే సర్వే చేస్తానని చెప్పగా రూ.30వేలకు ఒప్పం దం చేసుకున్నారు.
రెండ్రోజుల కింద రూ.10వేలు ఇవ్వగా, సర్వేయర్ వేణుగోపాల్, అసిస్టెంట్ సర్వేయర్ సూర్యవంశీ వచ్చి భూమిని కొలిచారు. మంగళవారం రిపోర్టు కోసం సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ప్రవీణ్ అసిస్టెంట్ సర్వేయర్ సూర్యవంశీకి రూ.20వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేణుగోపాల్, సూర్యవంశీని అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వారిని బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ పేర్కొన్నారు.