హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ కేసు విచారణ సందర్భంగా మాజీమంత్రి కేటీఆర్ తన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయవాదుల బృందం స్పష్టంచేసింది. ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు తీర్పు లేనప్పుడు మొబై ల్ ఫోన్లు అడిగే హకు ఏసీబీకి లేదని పేర్కొంది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయవాదులు ప్రస్తావించారు. ఫార్ములా-ఈ విచారణ సందర్భంగా తన మొబైల్ఫోన్లతోపాటు ల్యాప్‌టాప్ ఇవ్వాలని ఏసీబీ కోరిన నేపథ్యంలో కేటీఆర్ మంగళవారం హైదరాబాద్‌లో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం నడుస్తున్న కేసు విచారణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నిర్వహించిన క్రీడా కార్యక్రమానికి సంబంధించినది.
రాష్ట్ర ప్రభు త్వ నిర్ణయం తర్వాత రేసు నిర్వహణ పూర్తిగా అధికార యంత్రాంగం ద్వారా సాగింది. ఇందులో కేటీఆర్ నిర్ణయం మినహా వ్యక్తిగతంగా పరిమిత పాత్ర మాత్రమే పోషించారు. ఫార్ములా-ఈ కేసు అనేది ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్ప, వ్యక్తిగత సంభాషణకు సంబంధించి కాదు’ అని స్పష్టం చేశారు. జరిగిన ప్రతి నగదు లావాదేవీ అధికారికంగా బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు, అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ వ్యక్తిగత సమాచారం అడిగే హకు ఏసీబీకి లేదని తేల్చి చెప్పారు.
కోర్టు తీర్పు లేకుండా ఫోన్ ఇవ్వొద్దు
విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరుడిపై వాడేందుకు కుట్ర చేయడం అన్యాయమని గతంలో హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని గుర్తుచేశారు. వ్యక్తిగత ఫోన్లను కోర్టు తీర్పు లేకుండా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఫోన్ అడగడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఐటీ చట్టం ప్రకారం, ప్రైవసీ హకులకు విఘాతం కలిగించేలా ఉన్నదని ఆక్షేపించారు. ఈ చట్టాల ప్రకారం కోర్టు తీర్పు ఉన్నప్పుడు మాత్రమే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్‌ట్యాప్ లాంటి వ్యక్తిగత పరికరాలు అడగవచ్చని వివరించారు. ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవని అన్నారు. ఎటువంటి నిధుల దుర్వినియోగం లేకుండా, కుంభకోణం జరగని పరిస్థితిలో ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతున్నదని స్పష్టంచేశారు.
ఫోన్ అడగడం సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం: క్రిశాంక్
ఫార్ములా-ఈ కారు రేసు విచారణలో భాగంగా కేటీఆర్ ఫోన్‌ను ఏసీబీ అడగడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాతా నుంచి ఫార్ములా-ఈ నిర్వాహకుల ఖాతాకు నగదు బదిలీ జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ వ్యక్తిగత ఫోన్‌ను అప్పగించాలని ఏసీబీ అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అని చెప్పుకుంటూ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న కాంగ్రెస్.. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నదని, సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను అపహాస్యం చేస్తున్నదని మండిపడ్డారు.
కేటీఆర్ ఫోన్‌తో నీకేం పని రేవంత్‌రెడ్డి: సతీశ్‌రెడ్డి
ఏసీబీ అధికారులు కేటీఆర్ ఫోన్‌ను అడగడం చూసి ఆశ్చర్యమేసిందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే ఇది జరిగినట్టు స్పష్టమవుతున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ ఫోన్‌తో రేవంత్‌రెడ్డికి ఏం పని? అని మంగళవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఫార్ములా-ఈ కారు రేసు కేటీఆర్ వ్యక్తిగత వ్యవహారం కాదని పేర్కొన్నారు. అప్పటి క్యాబినెట్ ఆమోదం మేరకే ఆయన నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.