CV Anand | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): అవినీతి నిరోధకశాఖ గడిచిన ఆరు నెలల్లో 90కి పైగా ఏసీబీ కేసులతో లంచాధికారుల గుండెల్లో భయం పుట్టించింది. కొందరు నెటిజన్లు ఏసీబీ చేస్తున్న ప్రయత్నాన్ని ఎక్స్ వేదికగా కొనియాడటంతో.. ఆ శాఖ డీజీ సీవీ ఆనంద్ స్పందించారు. ‘6 నెలల నుంచి ఏసీబీ ట్రాప్‌లకు చిక్కిన అధికారుల సంఖ్య పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి ఉద్యోగుల్లో భయం పుట్టింది. ట్రాప్‌లు, ఇతర కేసులను త్వరగా పరిష్కరించడంలో ఏసీబీ అధికారుల శ్రమ ఫలితమే ఇది. లంచాధికారులు ఇప్పుడు ప్రతిదీ అనుమానాస్పదంగా చూస్తున్నారు.
వారి అలవాటు, అత్యాశ ట్రాప్‌లో పడేలా చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ కార్యాలయాల్లో ప్రజలు లంచాలు ఇవ్వకుండా పనులు పూర్తి చేసుకుంటున్నట్టు సమాచారం. లంచాల కోసం వేధింపులు తగ్గాయి. ఈ డ్రైవ్‌ను ఇలాగే కొనసాగిస్తాం’ అని ఏసీబీ డీజీ పేర్కొన్నారు. అధికారులను అరెస్ట్ చేసిన తర్వాత ప్రాసిక్యూషన్ ప్రొసీజర్‌ను త్వరితగతిన ముగించి.. జైలుకు పంపే ఏర్పాట్లు చేయాలని నెటిజన్ల నుంచి డిమాండ్లు వచ్చాయి.