సుబేదారి, ఆగస్టు 12: ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్న గుగులోత్ గోపాల్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి సబ్‌డివిజన్‌లో నీటిపారుదల శాఖ ఏఈగా పనిచేస్తున్న గుగులోత్ గోపాల్ పాలకుర్తి మండలం గుడికుంట తండా స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ బానోత్ కాంతి భర్త యాకూబ్ నాయక్ గ్రామపంచాయతీలో చేపట్టిన పనుల బిల్లులు మంజూరు చేయాలని గోపాల్‌ను సంప్రదించాడు. రూ.6 వేల లంచం ఇస్తే బిల్లులు మంజూరు చేస్తానని చెప్పడంతో యాకూబ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం.. సోమవారం హనుమకొండ నక్కలగుట్ట ఎస్బీఐ సమీపంలో యాకూబ్ నుంచి గోపాల్ రూ.6 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.