బంజారాహిల్స్,నవంబర్ 20: జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎస్ఎఫ్ఏలు) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్ఎఫ్ఐలుగా సలీమ్‌ఖాన్, జీ రమేశ్ పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ కాఫీషాపు వద్ద చెత్తాచెదారం వేస్తున్నారని, కిచెన్ వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నాయంటూ నిర్వాహకులను వేధిస్తున్నారు.
ఇటీవల కాఫీషాపు వద్దకు వెళ్లి తాము అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే షాపును సీజ్ చేయిస్తామని బెదిరించారు. దీంతో షాపు నిర్వాహకులు ఏసీబీని ఆశ్రయించారు. నిర్వాహకుడి నుంచి రూ.60వేలు తీసుకుంటుండగా ఎస్ఎఫ్ఏ రమేశ్‌ను బుధవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్ఎఫ్ఏ సలీం సూచన మేరకే లంచం తీసుకున్నానని చెప్పడంతో, అతడిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.
అబిడ్స్: హైదరాబాద్ మలక్‌పేట్-2 సర్కిల్లో ఇద్దరు వాణిజ్య పన్నులశాఖ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతాను డిఫ్రీజ్ చేయడానికి సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ మహబూబ్‌బాషా రూ.లక్ష డిమాండ్ చేయగా, అతడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఏసీటీవో సోమశేఖర్‌కు రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి, ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నగదును స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు అడిగితే అవినీతి నిరోధకశాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి సమాచారం అందించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.