ములుగు, నవంబర్ 11 : డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి బాధితుల నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్ రాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా ములుగు మం డలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించింది.
ఆ ఇంటిని మరొకరు కబ్జా చేయగా బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఆమెకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేయగా ములుగు ఎస్సై విజయ్‌కుమార్‌ను ఆశ్రయించారు. కబ్జాదారుల నుంచి ఇంటిని బాధితురాలికి అప్పగించేందుకు ఎస్సై రూ.లక్ష డిమాండ్ చేయగా రూ. 50వేలకు అంగీకరించారు. మంగళవారం రాత్రి బాధితులు రూ. 50 వేలు కానిస్టేబుల్ రాజు ద్వారా ఎస్సైకి అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.