పెద్దపల్లి కమాన్, జూలై 14 : పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల ఫైల్‌ను ఫార్వర్డ్ చేసేందుకు మున్సిపల్ ఏఈ సతీశ్‌కుమార్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగంపల్లిలోని ఏఈ నివాసంలో ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి, రూ.2 లక్షలతో పాటు ఆధారాలు లేని మరో రూ.32 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని తెనుగువాడ, కూనారం రోడ్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్‌కు రూ.12.28 లక్షల బిల్లు రావాల్సి ఉంది. దీనికోసం రూ.4.50 లక్షలు ఇస్తేనే ఫైల్‌ను ఫార్వర్డ్ చేస్తానని ఏఈ డిమాండ్ చేశారు. మంగళవారం రంగంపల్లిలోని ఏఈ తన నివాసంలో కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈ ఇంట్లో సోదాలు నిర్వహించి, ఆధారాలులేని రూ. 32 లక్షలు సీజ్ చేశారు. నిందితుడిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు వెల్లడించారు.