అంతర్గాం, నవంబర్ 19: పట్టుబడిన ఇసుక ట్రాక్టర్ విడిచిపెట్టేందుకు రూ.12 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఏసీబీకి అధికారులకు చిక్కాడు. ఈ ఘటన మంగళవారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. రామగుండానికి చెందిన ఆలకుంట మహేశ్ తన ట్రాక్టర్లో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుండగా మూడు రోజుల కింద పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
దీంతో మహేశ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి జరిమానా చెల్లిస్తా .. తన ట్రాక్టర్ అప్పగించాలని కోరాడు. ఇందుకు తహసీల్దార్ రమేశ్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. అన్ని డబ్బులు తాను ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరకు రూ.25 వేలు ఇస్తే వదిలిపెడుతామని తహసీల్దార్ చెప్పాడు. దీంతో మహేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు బాధితుడికి రహస్య కెమెరా ఇచ్చి ఫైనల్ సెటిల్మెంట్ కోసం తహసీల్దార్ వద్దకు పంపించారు.
చివరకు రూ.12 వేలు ఇస్తే వదిలేస్తానని తహసీల్దార్ రమేశ్ తేల్చిచెప్పాడు. అందుకు మహేశ్ కూడా అంగీకరించాడు. ఈ మాటలన్నీ కెమెరాలో రికా ర్డు అయ్యాయి. అనుకున్నట్టుగా మంగళవారం మహేశ్ రూ.12 వేలు తీసుకొని తహసీల్దార్ వద్దకు వెళ్లాడు. ఆ డబ్బులు ఆర్ఐ శ్రీధర్‌కు ఇవ్వాలని తహసీల్దార్ చెప్పడంతో మహేశ్ వెళ్లి ఆర్ఐకి ఇచ్చాడు. అదే టైంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో ఆర్ఐ వెంటనే ఆ డబ్బులను బయట పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తహసీల్దార్ రమేశ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని, ఆర్ఐ ని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.