హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ సరికొత్త వివాదం రాజుకున్నది. 300 మంది విద్యార్థుల ఫీజులను కాలేజీలు చెల్లించకపోవడం, ఆయా విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం కోల్పోవడం వివాదానికి దారితీసింది. ఫీజులు చెల్లించే అవకాశం కల్పించాలని, హాల్‌టికెట్లు జారీచేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలకు వారం రోజులు మాత్రమే ఉండటంతో విద్యార్థి సంఘాలు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)బుధవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించింది. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్(టీపీజేఎంఏ) ఏకంగా ఇంటర్ బోర్డు సెక్రటరీ చాంబర్లో బైఠాయించి ధర్నాకు దిగింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరించాయి. దీంతో బోర్డు కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ కార్యకర్తలు బోర్డు గేట్లు ఎక్కి ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు.
రాష్ట్రంలో 300 మంది ప్రైవేట్ ఇం టర్ కాలేజీల విద్యార్థుల పరీక్ష ఫీజును ఆయా కాలేజీలు ఇంటర్‌బోర్డుకు చె ల్లించలేదు. ఫీజు చెల్లింపు గడువు ము గిసింది. దీంతో కొందరు కోర్టుకు వెళ్లగా వారిని అనుమతించాలని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టుకు వెళ్లని పేద వి ద్యార్థులను అనుమతించకపోవడమేంటని ఏబీవీపీ ప్రశ్నించింది. ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది. శుక్రవారం నుంచి విద్యార్థుల వాట్సాప్‌కు హాల్‌టికెట్లను పంపించనున్నారు.