Telangana | అశ్వారావుపేట, అక్టోబర్ 13: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రైతులు లేకుండా రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. సభకు హాజరైన ముగ్గురు మంత్రులకు అన్నదాతలు గైర్హాజరై గట్టిగా షాక్ ఇచ్చారు. దసరా పండుగ రోజున కుటుంబంతో సంతోషంగా గడుపుదామనుకుంటే మంత్రులు సభ ఏర్పాటు చేయడంపై అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే రుణమాఫీ కాకపోవడం, రైతు భరోసా అందక పోవడంతో ఆగ్రహంతో ఉన్న రైతులు సభవైపు తొంగి చూడలేదు. వచ్చిన కొద్దిమందికీ మధ్యాహ్నం 2:15 గంటలు దాటినా మంత్రులు, అధికారులు భోజనాలు పెట్టలేకపోయారు. ఆగ్రహించిన రైతులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలతోనే సభ నిర్వహించాల్సి వచ్చింది.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఆయిల్‌పాం ఫ్యాక్టరీలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దసరా పండుగైన శనివారం ప్రారంభించారు. ఆయిల్‌పాం సాగుపై అవగాహన సదస్సు పేరిట భద్రాద్రి, ఖమ్మం జిల్లాల రైతులను అధికారులు బలవంతంగా తరలించారు. ఉదయం 10 గంటలకే మంత్రులు సదస్సును ప్రారంభిస్తారంటూ చెప్పిన అధికారులు.. అంతకు కొన్ని గంటల ముందే రైతులను సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం వరకూ సభ ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలకు గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు.
మధ్యాహ్నం మధ్యాహ్నం 12:08 గంటలకు మంత్రి తుమ్మల, 12:53 గంటలకు మంత్రి పొంగులేటి, మధ్యాహ్నం 2:14 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి హాజరయ్యారు. అప్పటికే అసహనం, ఆకలితో ఉన్న అన్నదాతలకు ఆ సమయంలో భోజనమూ అందించలేదు. దీంతో రైతులు మండిపడ్డారు. ‘మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనాల కోసం పడిగాపులు కాయాలా? వేళకు భోజనం చేయకుంటే బీపీ, షుగర్ ఉన్న రైతుల పరిస్థితి ఏంటి?’ అంటూ భోజన పేట్లను విసిరేశారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసులు జోక్యం చేసుకున్నా రైతులు పట్టించుకోలేదు.
‘పండుగ రోజు ఏంటి మాకు ఈ పరీక్ష? గత్యంతరం లేక ఈ సమావేశానికి వచ్చామా? పండుగ రోజున కుటుంబాలతో ఉండనీయకుండా, సమావేశం పేరిట భోజనాలు కూడా అందించకుండా ఎందుకు పిలిచారు?’ అంటూ ఆక్రోశం వెలిబుచ్చారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన మంత్రులు, ఎమ్మెల్యే.. ‘భోజనాల తర్వాత సమావేశం కొనసాగిద్దాం’ అంటూ ప్రకటించారు. అప్పటికే చాలామంది రైతులు ఇంటి బాటపట్టడంతో సభా ప్రాంగణమంతా ఖాళీ అయింది. వర్షం ఊపందుకోవడంతో రైతులు, అధికారులు ఇబ్బందులుపడ్డారు. రైతులు లేక సభ వెలవెలబోయినప్పటికీ ఖాళీ కుర్చీలకే మంత్రులు ప్రసంగాలు వినిపించి సభను ముగించారు.