జైనథ్, మే 8: రాష్ర్టాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తించే కాంగ్రెస్, బీజేపీ నుంచి కార్యకర్తలు, నాయకులు గులాబీ కండువా కప్పుకుంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలు 500 మంది మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరారు.
వీరికి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.
రైతులకు రైతుబీమా, రైతుబంధు, 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నదని, ఈ పథకాలనే కేంద్రం కాపీకొట్టి వివిధ రాష్ర్టాల్లో అమలు చేస్తోందని స్పష్టం చేశారు. జాతీయ పార్టీలకు తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, తదితరులున్నారు.