హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రదాడితో దేశం అప్రమత్తమైంది. అన్ని ప్రధాన నగరాలు యాక్షన్ మోడ్‌లోకి వచ్చేలా కేంద్రం అలర్ట్ చేస్తున్నది. అందులో భాగంగా యుద్ధం వస్తే తలెత్తే పరిణామాల నుంచి హైదరాబాద్ నగరానికి పొంచి ఉన్న ముప్పు నుంచి అప్రమత్తం చేయడమే ముఖ్యోద్దేశ్యంగా బుధవారం నగరంలో ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కాగా, తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు అందరీ దృష్టి హైదరాబాద్‌పై పడింది. నిజాం కాలం నుంచే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా నిలిచిన మహానగరం నాటి నుంచి నేటివరకు త్రివిధ దళాల స్థావరంగా కొనసాగుతూనే ఉంది. క్లిష్ట సమయంలో సైనికులకు ఆయుధాలను అందించే ఆయుధ భాండాగారంగా ఉంటూనే, రక్షణ వ్యవస్థకు సురక్షితమైన, వ్యూహాత్మక కేంద్రంగా నిలుస్తున్నది. రక్షణ శాఖకు అవసరమైన అన్ని మౌలిక వసతులను అందించే కేంద్రంగా, సైబర్ దాడులను ఎదుర్కొనే సైబర్ టెక్నాలజీ కలిగిన ప్రాంతంగా, ఎయిరోస్పేస్ హబ్‌గా నిలవడంతోనే హైదరాబాద్‌పై ఇప్పుడు అందరీ దృష్టి పడింది.
అమ్ములపొదిలో రక్షణ వ్యవస్థ కేంద్రీకృతమైనట్లుగా ఉండే హైదరాబాద్‌ను విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే అత్యంత కీలకమైన, వ్యూహాత్మక ప్రాంతంగా అభివర్ణిస్తారు. దీనికి నగరం చుట్టూరా ఉన్న మిలటరీ, ఎయిర్‌ఫోర్స్, సైంటిఫిక్ తదితర సంస్థలే కారణం. దీంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థలోనూ ముఖ్యభూమికను పోషిస్తున్నది. ఐటీ కేంద్రంగా, ఏయిరోస్పేస్ హబ్‌గా పేరుగాంచిన మహానగరంలో 37కు పైగా కేంద్ర రక్షణ, పరిశోధన, రక్షణ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో అంతరిక్ష పరిశోధనలకు ఇస్రోకు ఉపయోగపడే డేటా సెంటర్‌తోపాటు శాటిలైట్ తయారీలో అవసరమైన చిన్న చిన్న బొల్టులు, ఇంజిన్లు, టర్బైన్లు లాంటి అనేక పరికరాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. హకీంపేటలో కేంద్రీకృతమైన ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని టాటా ఎయిరోస్పేస్ సెంటర్, క్షిపణి రూపకల్పనలో కీలకపాత్ర పోషించే డీఆర్డీవో తదితర పదుల సంస్థలతో రక్షణ పరిశోధనలకు నగరం కేంద్రంగా ఉంది.
నగరవ్యాప్తంగా రక్షణ సంస్థలే…
యుద్ధ సమయంలో రక్షణరంగానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించడంలో హైదరాబాద్ ముందంజలో ఉంది. డిఫెన్స్ రిసెర్చ్, ఉత్పాదక వ్యవస్థలతోపాటు రక్షణ రంగానికి అవసరమైన డీఆర్డీవో, డీఆర్డీఎల్, రిసెర్చ్ సెంటర్ ఇమ్రాత్, డిఫెన్స్ మెటలర్జీకల్ రిసెర్చ్ లాబోరేటరీ, అడ్వాన్స్డ్ సిస్టం ల్యాబోరేటరీ, అణు ఉత్పత్తుల్లో కీలకమైన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్ఎఫ్సీ).. ఇలా 37కు పైగా రక్షణ, వాయు, రక్షణ పరిశోధన, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సంస్థలన్నీ నగరవ్యాప్తంగా కొలువై ఉన్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే శత్రుమూకల నుంచి రక్షణ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ప్రాంతం వ్యూహాత్మక స్థావరంగా సహజసిద్ధంగా గుర్తింపు పొందింది. అందుకే మొదటినుంచి హైదరాబాద్‌లో అనేక రక్షణరంగ సంస్థలను నెలకొల్పారు.
సిటీ అమ్ములపొదిలో ఎయిర్ డిఫెన్స్
ఎయిర్ బేస్ సెంటర్‌గా పిలిచే హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ సెంటర్ దేశంలోని ప్రధాన ఎయిర్ బేస్ సెంటర్ల కంటే పెద్దది. బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఎయిర్ బేస్ సెంటర్ల కంటే విస్తీర్ణంలో, వ్యూహాత్మక వాయు దాడులను సమర్థవంతంగా నిర్వహించడంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ సెంటర్ ముఖ్య భూమికను పోషిస్తున్నది. ఫైటర్జెట్లతోపాటు, హెలికాప్టర్ పైలట్లను ఇది అందిస్తున్నది. దక్షిణాది నుంచి శత్రు దేశాలపై విరుచుకుపడేలా ఎయిర్‌ఫోర్స్ సెంటర్‌గా హకీంపేట నిలుస్తున్నది. ఇక బోయింగ్ విమానాల ఉత్పత్తులు, టాటా లాక్‌హీడ్ మార్టిన్ వంటి అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ డిఫెన్స్ సిస్టంతోపాటు, అకాశ మార్గంలో గుట్టుగా దూసుకుపోతూ శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసే రాఫెల్ ఫైటర్ జెట్లను అందించే రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్, ఆధునాతన డ్రోన్లను ఉత్పత్తి చేసే స్టార్టప్‌లు పదుల సంఖ్యలో హైదరాబాద్ కేంద్రంగా నిర్విరామంగా సేవలందిస్తున్నాయి.
సైబర్ దాడులను ఎదుర్కొనేలా…
దేశంలోని ప్రధాన ఐటీ కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ నగరం… ముష్కర మూకల సైబర్ దాడులను సమర్థంగా ఎదుర్కొనే కేంద్రంగా పేరుగాంచింది. సిటీ కేంద్రంగా వందల ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. సైబర్ సెక్యూరిటీలోనూ హైదరాబాద్ ప్రధాన బాధ్యత వహిస్తున్నది. మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్ వంటి ఎన్నో కంపెనీలు డిఫెన్స్ అనుబంధ రంగాలకు సైబర్ సెక్యూరిటీ సేవలను అందిస్తుండగా, డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌కు ప్రాంతీయ కేంద్రంగా రక్షణ పరిశోధన కేంద్రాలైన డీఆర్డీవో, డీఆర్డీఎల్, ఆర్సీఐ, ఈసీఐఎల్‌తో కలిసి కమాండ్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌కు ఇక్కడే రూపకల్పన చేశారు. భారత సైన్యానికి ఆపత్కాలంలో కీలకమైన సమాచారాన్ని చేరవేసేలా హైదరాబాద్ నిలుస్తున్నది.
నగరంలోని పలు డిఫెన్స్ సంస్థలు..
ఇండియన్ ఆర్మీకి సెల్యూట్: కేటీఆర్
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగిన భారత సైన్యానికి సెల్యూట్.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారక రామారావు కొనియాడారు. ఈ దాడుల్లో పాల్గొన్న మనదేశ సాయుధ దళాలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడంలో సైన్యానికి మరింత శక్తి, సామర్థ్యాలు పెరగాలి. జైహింద్’ అని బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ధైర్యం మన సైన్యమే: హరీశ్‌రావు
భారతీయుల ధైర్యం.. భారత సైన్యమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘ఉగ్రవాదం మన శాంతిని దెబ్బతీసినప్పుడు, మన ఐక్యత, బలంతో, మన సైనికుల ధైర్యంతో ఎదుర్కొంటామని తెలిపారు. మనదేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదని తేల్చిచెప్పారు. భారత సాయుధ దళాల సామర్థ్యంపై అత్యంత గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. మేం వారికి దన్నుగా నిలబడతాం.. జై హింద్!’ అని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా తెలిపారు.సహించేది లేదు: ఎమ్మెల్సీ కవిత
ఉగ్రవాదాన్ని భారతీయులెవరూ సహించబోరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. భారత సాయుధ దళాలు పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. ‘భారత సాయుధ దళాలు ఈ దాడుల ద్వారా విజయం సాధించాయని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని సహించబోమని ప్రపంచానికి ఒక సందేశం వెళ్లిందని తెలిపారు. భారత్ మాతా కీ జై.. జై హింద్.. జై భారత్’ అని ఆమె పేర్కొన్నారు.
ఉగ్రవాదులను అంతమొందించాలి: వద్దిరాజు
ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయాలని, ఉగ్రవాదులను తుద ముట్టించాల్సిందేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. పర్యాటకులను అమానుషంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల శిబిరాలపై మన రక్షణ దళాలు చేపట్టిన చర్యలకు సెల్యూట్ చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ముషరుల నిర్మూలన చర్యలు దిగ్విజయంగా ముగియాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా యావత్తు దేశమంతా రక్షణ దళాలకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు
ఉగ్రవాదం అంతం కావాల్సిందే: వేముల
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన సైనిక చర్యపై భారతీయుడిగా గర్వపడుతున్నానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మన సత్తాచాటిన భారత సైన్యానికి అభినందనలు చెప్పారు. ప్రతిఒక్కరూ భారత సైన్యానికి అండగా నిలిచి వారి ధైర్యసాహసాలను మెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో భారతీయులంతా ఐక్యతను ప్రదర్శించాలని కోరారు.
కూకటివేళ్లతో పెకిలించాలి: నిరంజన్‌రెడ్డి
వనపర్తి టౌన్, మే 7: ఉగ్రవాద సంస్థలను కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. ఉగ్రవాద స్థావరాలపై బుధవారం భారత్ సైన్యం జరిపిన దాడికి మూకుమ్మడిగా మద్దుతు పలకాలని పిలుపునిచ్చారు. అమాయకులను కాల్చిచంపిన ఉగ్రమూకలపై భారత సైన్యం చేపట్టిన చర్యలకు సెల్యూట్ చేస్తున్నామని తెలిపారు. దేశం మొత్తం సైనికుల వెంటే ఉన్నదని, పార్టీలకతీతంగా దేశమంతా వారి వెనుక నడుస్తుందని స్పష్టంచేశారు. భారతీయులందరూ ఐక్యతను చాటాల్సిన సందర్భం ఇదని, ‘ఆఫరేషన్ సిందూర్’తో ఉగ్రమూకల నిర్మూలన కార్యక్రమం విజయవంతం కావాలని కోరారు.
దేశ భద్రతే ముఖ్యం: వినోద్‌కుమార్
కరీంనగర్ కార్పొరేషన్, మే 7: దేశ భద్రతే అన్నింటికన్నా ముఖ్యమని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో కోరారు. పాక్ ప్రతిదాడులను కూడా సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుందనే నమ్మకం ఉన్నదని తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయాలని కోరారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం దేశ భద్రతకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ప్రకటించామని, గతంలో సర్జికల్ ్రైస్టెక్ సమయంలోనూ తమ పార్టీ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. ‘ఆపరేషన్ సిందూర్’కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.