నేడు సంగారెడ్డిలో ప్రారంభించనున్న మంత్రులు హరీశ్, దయాకర్‌రావు
రాష్ట్రవ్యాప్తంగా 21,67,383 మహిళల ఖాతాల్లో రూ.543 కోట్లు జమ
హైదరాబాద్/సంగారెడ్డి, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అభయహస్తం లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను సంగారెడ్డి జిల్లా నుంచి ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మందికిపైగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.545 కోట్ల అభయహస్తం నిధులను వారి అకౌంట్లో ఈ-కుబేర్ ద్వారా జమచేస్తారు. 2009లో అభయహస్తం పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద పేరు నమోదు చేసుకున్న మహిళలకు 60 ఏండ్లు దాటితే రూ.500 నుంచి రూ.2 వేల వరకు ప్రతినెలా పింఛన్ అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ 60 ఏండ్లు దాటినవారికి రూ.2016 ఆసరా పింఛన్ ఇవ్వడం ప్రారంభించారు. అభయహస్తం పథకంతో అవసరం లేకుండానే అర్హులైన డ్వాక్రా మహిళలకు ఆసరా పింఛన్ అందుతున్నది. ఆ పథకం అవసరం లేకుండాపోయింది. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల్లో కొందరు చనిపోవడం, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లడం, ఇచ్చిన అకౌంట్ నంబర్లు సరిపోకపోవడం, ఇతర వివరాలు సేకరించడానికి సమయం పట్టింది. ఆ నాటి సభ్యులను మొత్తానికి గుర్తించి వివరాలు సేకరించారు. ఆదివారం నుంచి డబ్బులు జమ కానున్నాయి.