హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కడుపులో పెట్టి చూసుకుంటూ సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఖ్యాతి పొందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
నేటి వజ్రోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేస్తున్నాను. ఆసరా పథకంలో భాగంగా నేటి నుంచి మరో 10 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుందని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ది చేకూరుతుంది. ఫించన్ల మొత్తం పెంచడమే కాకుండా లబ్దిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని సవినయంగా తెలియజేస్తున్నానని కేసీఆర్ తెలిపారు.