హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
సీజనల్ వ్యాధులతోపాటు పాముకాటు నివారణ మందులు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. భౌగోళికంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా దవాఖానలు ఎంత దూరంలో ఉన్నాయో హెల్త్ ఫెసిలిటీస్ మ్యాపింగ్‌ను సిద్ధం చేయాలని టీజీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, ఈడీ కౌటిల్య, చీఫ్ ఇంజినీర్ దేవేందర్‌కుమార్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో విశాలాక్షి పాల్గొన్నారు.
తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో మంత్రి దామోదరను మంగళవారం కలిశారు. సమస్యలను మంత్రికి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 12,900 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని, పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. తమకు వెంటనే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేయాలని విన్నవించారు. ఈ అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వేదిక నాయకులు రమేశ్, శంకర్‌ముదిరాజ్, బాలబ్రహ్మచారి, వెంకట్‌రెడ్డి, హుస్సేన్, మోహన్ పాల్గొన్నారు.