హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): వైఎస్ఆర్ హయాంలోని కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు నీరుగారుస్తున్నదా? ఇందులో భాగంగానే ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి బకాయిలు పెండింగ్ పెడుతున్నదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తున్నది. ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశలోనే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని పెద్ద దవాఖానలైన సికింద్రాబాద్‌లోని గాంధీ, ఎంఎన్‌జే, టీచింగ్ హాస్పిటల్స్, వైద్యవిధానపరిషత్‌కు చెందిన వాటితోపాటు జిల్లా కేంద్రాల్లోని దవాఖానలకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.600 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. నిధుల కొరత కారణంగా సర్కారు దవాఖానలకు ఖరీదైన మందులు, సర్జికల్ ఇంప్లాంట్లు (స్టంట్లు, ప్లేట్లు), ఇతర అత్యవసర సేవలకు సంబంధించిన పరికరాలను సరఫరా చేసిన ఏజెన్సీలకు బిల్లు చెల్లింపులు నిలిచిపోయాయి. దవాఖానల్లో శస్త్రచికిత్సలు, వైద్యం అందించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతున్నది.
దవాఖానల నిర్వహణ భారంగా రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సకు పేరు గాంచిన ప్రభుత్వ ఎంఎన్‌జే దవాఖానకు రూ.100 కోట్లు, గాంధీ దవాఖానకు రూ.50 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నట్టు తెలిసింది. నిజామాబాద్ జిల్లా దవాఖానకు రూ.9 కోట్లు, ఇంకా వరంగల్ ఎంజీఎం సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన దవాఖానలకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. మరోవైపు రూ.1400 కోట్ల బకాయిల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ప్రైవేటు నెట్వర్క్ దవాఖానలు ఇటీవల రాష్ట్రంలో ‘ఆరోగ్యశ్రీ’ సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచి ప్రతి నెలా తప్పనిసరిగా రూ.100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినా.. ఆచరణలో మాట తప్పింది. గత రెండు నెలలుగా ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ దవాఖానలు అల్లాడుతున్నాయి. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు నెట్వర్క్ దవాఖానలకు ‘ఆరోగ్యశ్రీ’ చెల్లింపుల్లో జాప్యం కారణంగా పథకం అమలుపై నీలినీడలు అలుముకున్నాయి.
జీతాలు వస్తున్నాయనే సాకుతో ప్రభుత్వ దవాఖానల్లో ఆయా సర్జరీలు, చికిత్సలకు సంబంధించి వైద్యులకు ఆరోగ్యశ్రీ కింద ఇన్సెంటివ్ ఇవ్వాలి. కానీ వారికి జీతాలు ఇస్తున్నాం అన్న నెపంతో ఇన్సెంటివ్‌ల చెల్లింపులో ప్రభుత్వం ఆలసత్వం వహిస్తున్నది. ఇంప్లాంట్స్ సైప్లె చేసే వారికి కూడా చెల్లింపులు జరపాలి.ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై దృష్టి సారించి వెంటనే ‘ఆరోగ్యశ్రీ’కి నిధులు విడుదల చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
దవాఖాన బకాయిలు