Aadhaar Number | ముత్తారం, ఆగస్టు 30 : ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు చేయడం ఇద్దరు రైతులకు శాపంగా మారింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం పీఏసీఎస్‌లో జరిగిన ఈ ఘటనతో ఖంగుతిన్న ఆ రైతులు మీకో దండం సారు.. నాకు రుణమాఫీ చేయండి మహాప్రభో అంటూ అధికారులను వేడుకున్నారు. ముత్తారం మండలంలోని ఓడేడుకు చెందిన అల్లాడి రవీందర్రావు ముత్తారంలోని ఎస్బీఐలో రూ.1.65 లక్షల పైచిలుకు రుణం తీసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో అల్లాడి రవీందర్రావు ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ద్వారా వ్యవసాయం కోసం రూ.50 వేల పైచిలుకు రుణాన్ని పొందాడు. అధికారులు రూ.50 వేల రుణం తీసుకున్న అల్లాడి రవీందర్రావు ఆధార్ నెంబర్‌కు బదులు ఎస్బీఐలో రూ.1.65 లక్షల రుణం తీసుకున్న అల్లాడి రవీందర్రావు ఆధార్ నెంబర్‌ను తప్పుగా నమోదు చేశారు. దీంతో పీఏసీఎస్‌లో రుణం తీసుకున్న అల్లాడి రవీందర్రావు పేరిట రూ.2.15 లక్షల పైచిలుకు రుణం ఉన్నట్టు చూపించడంతో ఆయనకు రుణమాఫీ జరగలేదు. మరోవైపు రూ.50 వేలు తీసుకున్న రవీందర్రావు ఆధార్ నమోదు కాక ఆయనకూ రుణమాఫీ కాలేదు. దీంతో రవీందర్రావు శుక్రవారం పీఏసీఎస్‌కు వచ్చి సీఈవోను ప్రశ్నించారు. తనకు రుణమాఫీ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆత్మహాత్యే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యాడు. దీనిపై పీఏసీఎస్ సీఈవో ప్రసాద్‌ను వివరణ కోరగా తప్పిదం జరిగిన విషయం వాస్తవమేనని ఒప్పుకున్నాడు.
సహకార సంఘంలో జరిగిన అక్రమాల వల్లే రుణమాఫీ కోల్పోయామని శుక్రవారం రుద్రూర్ మండలం బొప్పాపూర్ రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి రైతుల అసలు బాకీ చూపించకుండా తక్కువ చేసి చూపించడంతో బొప్పాపూర్‌కు చెందిన 50మంది రైతులు రుణమాఫీ కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. – రుద్రూర్