TGSRTC | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆర్టీసీ కల్పించే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ‘జీరో టికెట్’ తీసుకోవడానికి ఆధార్‌కార్డు ఒక్కటే ప్రామాణికం కా దని ఆర్టీసీ ఎండీ వీ సీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ నెటిజెన్‌కు సమాధానం ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి తదితర గుర్తుంపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించి జీరో టికెట్‌ను పొందొచ్చని చెప్పారు.
ముదావత్ రమేశ్ నాయక్ అనే నెటిజన్ ‘తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు జీరో టికెట్ కోసం ఆధార్ ఉంటే చాలా? కచ్చితంగా అప్డేటెడ్ ఆధార్ కావాలా? దయచేసి నిర్ధారించండి’ అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేశారు. దీనికి ఎండీ పై విధంగా సమాధానం ఇచ్చారు. సజ్జనార్ సమాధానికి రమేశ్‌నాయక్ స్పందిస్తూ.. తన పాప 6వ ఏట అడుగుపెట్టిందని, కొన్ని కారణాల వల్ల ఆధార్ అప్డేట్ చేయించుకోలేదని తెలిపారు. ఇదే విషయాన్ని కండక్టర్లకు చెబితే.. వినలేదని వాపోయాడు. ‘సార్ మీరేమైనా ఆధార్ కార్డు నంబర్‌ను టికెట్‌పై ఎంట్రీ చేయడం లేదు కదా?’ అని కండర్లను ప్రశ్నించినా వారు టికెట్ కొట్టారని చెప్పాడు.