Telangana | సిరికొండ/నెక్కొండ, జనవరి 6 : కాంగ్రెస్ పాలన ఏమో కానీ రైతులకు తిప్పలు మొదలయ్యాయి. ఎరువుల కోసం సొసైటీల ఎదుట ఆధార్, పాస్‌బుక్ జిరాక్స్‌ల వరుసలు కనిపిస్తున్నాయి. చలిలో అన్నదాతలు క్యూ కడుతున్నారు. అదను ఎత్తిపోతున్నదని, యూరియా దొరకక ఏం చేయాలో అర్థమైతలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ ఎరువుల కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో సోమవారం పలు సొసైటీల ఎదుట కనిపించిన దృశ్యాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా సిరికొండ సొసైటీకి సంబంధించి చీమన్‌పల్లిలో ఉన్న సెల్ పాయింట్ వద్ద సోమవారం రైతులు బారులుతీరారు. వరంగల్ జిల్లా నెక్కొండలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. సొసైటీ ఎదుట బారులు తీరి యూరియా కొనుగోలు చేశారు. ఫర్టిలైజర్ షాపుల్లో యూరియాను అధిక ధరకు విక్రయించడంతోపాటు డీఏపీ, ఇతర మందులు అంటగడుతున్నారని రైతులు పేర్కొన్నారు. సొసైటీల్లో ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని, మూడు బస్తాలు కావాల్సిన వారికి నానో యూరియా ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కాగా, రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా నిల్వలున్నాయని, మంగళవారం మరో 60 టన్నుల లోడ్ తెప్పిస్తున్నట్టు స్థానిక వ్యవసాయాధికారి నాగరాజు వెల్లడించారు.
భూపాలపల్లి రూరల్ : పంటకు గిట్టుబాటు ధర రాక.. రైతు భరోసా అందక అప్పుల పాలైన యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందిగామలో చోటుచేసుకుంది. గ్రామానికి చెంది న నీలాల శేఖర్(29) తమ 6 ఎకరాలతో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకున్నా డు. రూ.10 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక ఈ నెల ఒకటిన పురుగులమందు తాగాడు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.