వరంగల్ చౌరస్తా, ఆగష్టు 18: ఇందిరమ్మ ఇంటి కోసం వరంగల్ చౌరస్తాలో ఓ యువకుడు సోమవారం రాత్రి హోర్డింగ్ హల్చల్ చేశాడు. నగరం నడిబొడ్డున ఈ ఘటనతో పాదచారులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సీఐ సుజాత ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కిందకు దిగివచ్చాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, యువకుడి ఆత్మహత్యాయత్నానికి గల వివరాలను పోలీసులు ఆరా తీయగా, తన పేరు కొమ్ముల సుభాష్ అని తెలిపాడు. తాను వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి గ్రామానికి చెందిన తనకు ఇల్లు లేదని తెలిపాడు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో స్థానిక నాయకులు మోసం చేశారని వాపోయాడు. కనీస నీడలేక తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్నదని, అందువల్లే హోర్డింగ్ ఎక్కానని ఆవేదన వ్యక్తంచేశాడు. అక్కడే ఉన్న అతడి భార్య సంధ్యారాణిని గుర్తించిన పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించివేశారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ సీఐ సుజాతను పోలీసు ఉన్నతాధికారులు, స్థానికులు అభినందించారు.