భిక్కనూరు, అక్టోబర్ 21 : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు దక్షిణాఫ్రికాలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. దీపావళి రోజున ఈ ఘటన చోటుచేసుకోగా మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరుకు చెందిన బత్తుల శ్రీనివాస్ (32) వృత్తి రీత్యా బోర్‌బండి ఆపరేటర్‌గా కొన్నేడ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నాడు.
కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాకు వెళ్లిన శ్రీనివాస్ సోమవారం తాను నివాసం ఉంటున్న ఇంటి వెనుకభాగంలో ఉన్న చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా షాక్‌కు గురవగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.