కేతెపల్లి : నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నగేష్ యాదవ్ అనే వ్యక్తికి మీసాల సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నది.
ఈ క్రమంలో సుజాత తన ఇద్దరు కూతుళ్లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని నగేష్‌పై ఒత్తిడి తెచ్చింది. అయితే తనకు ఇప్పటికే భార్య, బిడ్డ ఉన్నందున పెళ్లి చేసుకోలేనని నగేష్ స్పష్టంచేశాడు. దాంతో కోపం పెంచుకున్న సుజాత.. ప్రియుడు నగేష్ ఇంటికి వెళ్లింది. అక్కడ పసిబిడ్డకు పాలిస్తున్న నగేష్ భార్య మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.
ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో చిన్నారిని దూరంగా విసిరేసిన నగేష్ భార్య మమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పసిబిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కాగా ఘటన అనంతరం నిందితురాలు నాంపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.