వికారాబాద్/నవాబుపేట, అక్టోబర్ 21: రీజినల్ రింగ్ రోడ్ భూబాధితురాలు తీవ్ర మనోవేదనతో గుండెపోటుతో మరణించింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం చించల్‌పేట (చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సొంతూరు)లో సోమవారం చోటుచేసుకున్నది. సర్కార్ అలైన్మెంట్ మార్చడం వల్లే బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఇంకెంత మంది చనిపోతే సర్కార్ మేల్కొంటుందని ట్రిపుల్ ఆర్ బాధితులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఇలా.. చించల్‌పేటకు చెందిన గుడిసె అంజమ్మ (60), అంజయ్య దంపతులు. వీరి కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నది. రెండు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ కోసం కొత్తగా భూసర్వే చేపట్టింది. ఇందులో భాగంగా అంజమ్మకు చెందిన సర్వే నంబర్ 132లో 2.05 ఎకరాల భూమి ఉన్నది. అందులోంచి రోడ్డు వెళ్తుండటంతో ప్రభుత్వం తమ భూమి తీసుకుంటుందని తీవ్ర మనోవేదనకు గురైంది. భూమి పోతే బతుకుదెరువు ఎలా అని తరుచూ ఆందోళనకు గురయ్యేది. ఈ క్రమంలో దీపావళి పండుగ పూట సోమవారం అంజమ్మ గుండెపోటుతో మృతి చెందింది.
కాంగ్రెస్ సర్కార్ కొత్త అలైన్మెంట్తో తిప్పలు పెడుతున్నదని అంజమ్మ మనుమడు గెడిసె సుభాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ట్రిపుల్ ఆర్ గురించి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం, అధికారులు ఇస్టానుసారంగా వ్యవహరించడమే తమ అమ్మమ్మ మృతికి కారణమని ఆరోపించాడు. రేపు ఇదే పరిస్థితి చాలామందికి రావొచ్చని, ఇలా ఎంతమంది చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు స్పందిస్తారని ప్రశ్నించాడు.
అంజమ్మకు ఐదుగురు కూతుళ్లు. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురుని ఇల్లరికం పెట్టుకున్నది. ట్రిపుల్ ఆర్కు సంబంధించి భూమి వెళ్తుందనే సమాచారం వచ్చిన్నప్పటినుంచి అంజమ్మ ఆందోళనకు గురవుతున్నది. చివరకు ప్రాణాన్నే వదిలింది. ఇదే గ్రామం లో బ్యాగరి యాదగిరి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తాడు. అతనికి 2 ఎకరాల భూమి ఉండగా బోరు వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ సమస్య వచ్చిన్నప్పటినుంచి ఆయనకు మతిస్థిమితం సరిగ్గా ఉండటంలేదు. ప్రస్తుతం ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మరో వ్యక్తి కొండపురం కిష్టయ్య ఎకరం భూమి ఉన్నది. దాదాపు 10 బోర్లు వేయగా .. చివరకు ఒక్క బోరులో పుష్కలంగా నీరు పడింది. నిమ్మతోట సాగు చేస్తున్నాడు. ట్రిపుల్‌ఆర్‌లో మొత్తం పోతుండటంతో మతిస్థిమితి తప్పినట్టు ప్రవర్తిస్తున్నాడు. కొడుకులు ఆయన్ను దవాఖానకు తిప్పుతూనే ఉన్నరు.
– కృష్ణారెడ్డి, ట్రిపుల్ ఆర్ బాధిత రైతుల జేఏసీ నాయకుడు, చించల్‌పేట