హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్ కాలనీలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బులు పెట్టి.. ఓటర్లకు పంచుతున్నారని సమాచారం అందడంతో… ఎన్నికల అధికారులు మేజిస్ట్రేట్ స్థాయి అధికారితో కలిసి, భారీగా బందోబస్తు మధ్య సోదాలు నిర్వహించారు. ఇంట్లోని లైట్లు ఆర్పివేసి సోదాలు నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి… ఇంట్లోకి తమను కూడా అనుమతించాలని అధికారులను కోరారు. కానీ అధికారులు అనుమతించకపోవడంతో వాగ్వాదం జరిగింది. గంటసేపు సోదాలు జరుపుతున్నామంటూ హడావుడి చేసిన అధికారులు.. ఏమీ దొరకలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారులు, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, సిటీ బ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఏకంగా ప్రార్ధనా మందిరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల నియమావళి ప్రకారం దేవాలయాలు, చర్చీలు, మసీదుల్లో ఏ రాజకీయ పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ ప్రచారం చేయకూడదు.

కానీ కాంగ్రెస్ పార్టీకి అవేమీ వర్తించవన్నట్టుగా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. షబ్బీర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్నికల అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.