తొగుట, సెప్టెంబర్ 11 : అప్పుల బాధలు భరించలేక ఓ కౌలు రైతు తనువు చాలించాడు. ఈ ఘటన బుధవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం కన్గల్ గ్రామంలో చోటుచేసుకుంది. దొమ్మాట స్వామి (35) కన్గల్ గ్రామానికి చెందిన పెద్దమాతర మల్లయ్య వద్ద మూడెకరాల భూమి కౌలుకు తీసుకుని ఐదేండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఆశించిన దిగుబడి రాక నష్టాలపాలయ్యాడు. దీంతో తెచ్చిన పెట్టుబడులు మీదపడి రూ.8 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు పెరగడంతో మనస్తాపం చెందాడు. వాటిని తీర్చే దారి కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం కౌలు చేస్తున్న పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టాడు. మృతుడికి భార్య దొమ్మాట లావణ్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై వీ రవికాంతారావు తెలిపారు.
గాంధారి, సెప్టెంబర్ 11: ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌తో ఓ యువ రైతు మృతి చెంది న ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. గుర్జాల్ గ్రామానికి చెందిన అమర్లబండ దేవేందర్‌రావు(35) బుధవారం ఉదయం తన చేనులోని పత్తిపంటకు పురుగుల మందును పిచికారీ చేయడానికి వెళ్లాడు. బోరుమోటర్ నడవకపోవడంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్తు తీగ తెగిపోవడంతో దానిని ఓ కర్రతో సరిచేస్తుండగా షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భా ర్య లావణ్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉ న్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
జనగామ రూరల్, సెప్టెంబర్ 11: తొమ్మిది నెలల గర్భిణినంటూ కుటుంబసభ్యులతోపాటు డాక్టర్లను బురిడీ కొట్టించిన ఘటన జనగామ ఎంసీహెచ్‌లో బుధవారం చోటుచేసుకున్నది. కొడకండ్ల మండలం మొండ్రాయి తండాకు చెందిన ఓ వివాహిత పురిటి నొప్పులు వస్తున్నాయంటూ కుటుంబసభ్యులకు తెలిపింది. జనగామ మండలం పసరమడ్ల శివారు చంపక్ హిల్స్‌లో ఉన్న మాతాశిశు దవాఖానకు తరలించారు. పరీక్షల కోసం డాక్టర్లు పిలవగా బాత్రూం వెళ్తానని చెప్పి అరగంటపాటు అందులోనే ఉండి తర్వాత బయటికి వచ్చింది. బాత్రుంలోనే అబార్షన్ అయిందని, పుట్టినబాబు డ్రైనేజీలో పడిపోయాడని తెలిపింది. కంగుతిన్న డాక్టర్లు ఎంత వెతికినా అలాంటి ఆనవాళ్లు కనబడలేదు. అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సదరు మహిళ గర్భిణి కాదని తేల్చడంతో అందరూ అవాక్కయ్యరు.