Satya Jyoti | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నారాయణపేటలో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి కార్యక్రమంలో ఓ విద్యార్థిని ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. నారాయణపేట మెడికల్ కాలేజీ విద్యార్థిని సత్యజ్యోతి తన కుటుంబ, విద్యానేపథ్యంపై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పలువురు మంత్రులు, అధికారుల సమక్షంలో విద్యార్థిని మాట్లాడుతూ ‘నా పేరు సత్యజ్యోతి. మాది నల్లగొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం. నేను ఎంబీబీఎస్ విద్యార్థినిని. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. నేను 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు గురుకుల పాఠశాలలో చదివాను. అక్కడ చదివి ఇక్కడికి వచ్చాను. చిన్నప్పట్నుంచి డాక్టర్ అవ్వాలన్నది నా కల. గురుకులాల్లో చదివితే డాక్టర్ అవుతానో లేదో అనుకునేదాన్ని. ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నాను.
మా తండా నుంచి ఫస్ట్ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థినిని నేనే. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాతోపాటు మా తల్లిదండ్రులు. మా ప్రజలందరూ గర్వంగా భావిస్తున్నారు. కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లనే నాలాంటి పేద విద్యార్థినికి, చాలామందికి వైద్యవిద్య చదువుకునే అవకాశం వచ్చింది. నాతో పాటు నా మిత్రులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను’. అనడంతో కాంగ్రెస్ నేతలకు నోట మాట రాలేదు. కేసీఆర్ హయాంలో నారాయణపేట జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కావడం.. ఫ్రీ సీటుతో చదువుకోవడం ఇవన్నీ కేసీఆర్ ఆలోచనతోనే అంటూ జనం చర్చించుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎంత చెరిపివేయాలని చూసినా తెలంగాణలో ప్రతి దిక్కున కేసీఆర్ ఆనవాళ్లు ఆయన్ను వెంటాడుతూనే ఉంటాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాడు కేసీఆర్ వజ్రసంకల్పంతో చేపట్టిన మెడికల్ కాలేజీల్లో నేడు ఎంతోమంది బడుగు విద్యార్థులు వైద్యవిద్య చదువుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన మనోగతం పంచుకున్నారు. ‘రేవంత్ రెడ్డికి నిజాలు ఇష్టం లేకపోయినా అవి ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి.
తెలంగాణను అభివృద్ధి ప థంలో నడిపిన కేసీఆర్ ఆనవాళ్లు రేవంత్‌రెడ్డికి కళ్లు తెరిపించిన సంఘటన ఇది. ఓ గిరిజన తండా నుంచి తొలిసారి ఎంబీబీఎస్ సీట్ సా ధించి డాక్టర్ కాబోతున్న సత్యజ్యోతి విజయం ఎలా సాధ్యమైంది? కేసీఆర్ 250 గురుకులాలను 1020కి పెంచడం వల్ల, మెడికల్ కాలేజీలను 5 నుంచి 33కి పెంచడం వల్ల, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసినందువల్ల, కేసీఆర్ వజ్రసంకల్పం వల్లే సత్యజ్యోతిలాంటి ఎందరో బడుగువర్గాల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు రేవంత్‌రెడ్డీ.. అది తెలంగాణ ముఖచిత్రంపై ఆయన చేసిన చెరగని సంతకం!’ అని సత్యజ్యోతి మాట్లాడిన వీడియో ట్యాగ్ చేశారు.
గురుకులాల నుంచి వైద్యవిద్యను అభ్యసిస్తున్న సత్యజ్యోతి వంటి విద్యార్థుల గురించి బీఆర్ఎస్ నేత, గురుకులాల పూర్వ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘గురుకులాల వల్ల ఎందరి జీవితాలు మారతాయో? మీరు మా మీద ఫేక్ కేసుల కోసం కోట్లు ఖర్చు పెట్టే బదులు అవే పైసలను ఈ పేద పిల్లల మీద పెట్టండి, కొంచెం పుణ్యమైనా దకుతుంది.. అర్థమైందా రేవంత్‌రెడ్డి’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.