పెబ్బేరు(వనపర్తి) : కొడుకు ఉన్నతి కోసం అనేక కష్టాలు పడ్డ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ బాధను దిగమింగుకుని ఓ కొడుకు పది పరీక్షల(Tenth Exams)కు హాజరయ్యాడు. వనపర్తి జిల్లా (Vanaparthy district) పెబ్బేరులోని అంబేద్కర్ నగర్‌కు చెందిన దేవరపల్లి గోవిందు అనే వ్యక్తి మూడు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖాన(Osmania Hospital)లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
అయితే గోవిందు కొడుకు(Son) శ్రావణ్ కొత్తకోట పట్టణంలోని వీపనగండ్ల బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి(Tenth Class) చదువుతూ కొత్తకోట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఫైనల్ పరీక్షలు(Final Exams) రాస్తున్నాడు. మంగళవారం తండ్రి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నా ఆ విద్యార్థి మాత్రం హిందీ పరీక్షకు హాజరయ్యాడు. శ్రావణ్ పరీక్ష రాసి ఇంటికొచ్చాక కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.