HYDRAA | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అధికారుల్లో ఇప్పుడు హైడ్రా చిచ్చు మొదలైంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయించటం, చెరువులు, నాలాలను కబ్జా చెర నుంచి విడిపించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొందరినే లక్ష్యంగా చేసుకొని హైడ్రా పనిచేస్తున్నదన్న ఆరోపణలు వస్తుండగా, ఆరుగురు మున్సిపల్, రెవెన్యూ అధికారులపై కేసు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమ శాఖల అధికారులపై కేసు పెట్టడం ఉన్నతాధికారుల్లో ఒకింత అసహనం వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ఈ తరహా కేసు పెట్టడం ఇదే తొలిసారి కాగా, ఎప్పుడో ఇచ్చిన అనుమతులపై ఇప్పుడు కేసులు నమోదు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అనేక నిర్మాణాల్లో అనేక ఉల్లంఘనలు ఉన్నాయని, వారందరిపైనా ఇవే కేసులు పెడతారా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. అధికారులపై కేసు.. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదంగా మారినట్టు సమాచారం. తమకు తెలియకుండానే కేసులు నమోదు చేయటంపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఒకరు పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. హైడ్రా కమిషనర్, పోలీస్ ఉన్నతాధికారులను పిలిచి ఇదేం పద్ధతి అని నిలదీసినట్టు సమాచారం. ‘మీరు ఇట్లా కేసులు పెట్టేముందు మాకెందుకు చెప్పలేదు. ఇట్లా కేసులు పెట్టి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నట్టు?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఒక్క వీరితోనే ఆపేస్తారా? ఒక్క వీళ్లు మాత్రమే తప్పు చేశారంటారా? అని పలువురు ఐఏఎస్‌లు హైడ్రా అధికారులను నిలదీసినట్టు సమాచారం. ఐఏఎస్‌లను కాదని, ఐపీఎస్‌ను ప్రభుత్వం కమిషనర్‌గా పెట్టడంపైనా పలువురు ఐఏఎస్‌లు తప్పుపడుతున్నట్టు తెలిసింది. అడ్మినిస్ట్రేషన్‌లో ఇంత పెద్ద బాధ్యత ఒక ఐపీఎస్ చేతిలో పెట్టడం ఏమిటి? అని ఇటీవల సచివాలయంలో అత్యంత కీలకమైన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
బిల్డర్లపై హైడ్రా ఎందుకు కేసులు పెట్టడం లేదన్న చర్చ జరుగుతున్నది. చెరువుల వద్ద ఇండ్లు కట్టిన, అపార్ట్మెంట్లు, వెంచర్లు వేసి, భవనాలు కట్టినవారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అధికారులను లక్ష్యంగా చేసుకోవడమేమిటన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్నది. ఇదే విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు స్వయంగా అన్నట్టు తెలిసింది. అధికారులపై కేసులు పెట్టేముందు వారి శాఖలతో సంబంధం ఉన్న అధికారులకు సమాచారం ఇవ్వడం కనీస మర్యాద, పద్ధతి అని స్పష్టం చేసినట్టు సమాచారం. ఉద్యోగులపై కేసులు పెట్టడం ప్రభుత్వ పాలసీ కాదని, తాను రాష్ట్రంలో ఉన్నతాధికారిగానే ఉన్నానని పేర్కొన్నట్టు తెలిసింది.