Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): తొమ్మిదిన్నరేండ్ల క్రితం వరకూ రాష్ట్రం ఎలా ఉన్నది.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఎలా పరివర్తన చెందింది.. కండ్లకు కట్టినట్టు చూపించే ఓ ప్రత్యేక వెబ్సైట్ ఆవిష్కృతమైంది. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ రూపాన్ని ఇస్తూ ఈ వెబ్సైట్ను ప్రారంభించింది.
‘ఎట్లుండే తెలంగాణ- ఎైట్లెంది తెలంగాణ (http://etlundetelangana etlaindi telangana.com)’ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు, 2014 నుంచి ఇప్పటివరకు యావత్ తెలంగాణలో చోటు చేసుకున్న మార్పులు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ వెబ్సైట్లో వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జిల్లాలు, భౌగోళిక స్వ రూపం, ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో ఈ తొమ్మిదిన్నరేండ్లలో మారిన భౌగోళిక స్వరూపాన్ని ఫొటోలు, సమాచారంతో కండ్లకు కట్టినట్టు ప్రచురించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సోషల్ మీడియా వేదికైన ఎక్స్ ద్వారా ఈ వెబ్సైట్ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ఆరోపణలు, అసత్యపు ప్రచారాలకు చెక్ పెట్టేలా రూపొందిన ఈ డిజిటల్ వేదికకు జనాల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది.