హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీ వరకు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు. కవితకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందంటూ ఈడీ వ్యతిరేకించింది.
ఈ నెల 4న విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్పై తీర్పును రిజర్వుచేసిన కోర్టు, సోమవారం బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. తనను ప్రశ్నించేందుకు సీబీఐకి ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ కవిత దాఖలుచేసిన పిటిషన్పై ఈనెల 10న విచారణ జరగనుంది.