Suicide | పాల్వంచ, సెప్టెంబర్ 11 : దంపతుల మధ్య చోటు చేసుకున్న గొడవ.. భార్య ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన పాత పాల్వంచలో చోటు చేసుకుంది.
పాత పాల్వంచకు చెందిన కటారు ప్రశాంతి(36) వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి. అదే గ్రామానికి చెందిన కటారు రవి శేఖరశాస్త్రితో ప్రశాంతికి 14 ఏండ్ల క్రితం వివాహమైంది. అప్పటినుంచి బార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. భర్త నవభారత్ పవర్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రశాంతి మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. ప్రస్తుతం ఆమె వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
అయితే సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ పడ్డారు. భర్త మాట్లాడిన మాటలకు ఆమె తీవ్ర మనస్థాపానికి గురై క్షణికావేశంలో మంగళవారం తెల్లవారుజామున హాలులో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఉదయం నిద్రలేచి చూడగా భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకోవడాన్ని గమనించి చుట్టుపక్కల వారిని పిలిచి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి బాబాయి సీహెచ్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పాల్వంచ పట్టణ ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.