Social Survey | హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోషల్ ఎకనామిక్ సర్వే నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తున్నది. 60 రోజుల్లో సర్వే పూర్తిచేయాలని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో ఫార్మాట్ రూపకల్పనపై మంతనాలు కొనసాగుతున్నాయి. సర్వే విధివిధానాలపై సీఎస్‌తో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక, ప్రణాళికశాఖ సీనియర్ అధికారులు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. రెండు, మూడు రోజుల్లో సర్వేకు సంబంధించిన ఫార్మాట్ సిద్ధమవుతుందని ఆర్థిక, ప్రణాళికశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇంటి యజమాని బ్యాంకు ఖాతా నంబర్‌తోపాటు కుటుంబ పూర్తి వివరాలను రాబట్టేందుకు 50 ప్రశ్నలను సర్వేపత్రంలో పెట్టే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపాయి.
రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి కులాలవారీగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలపై సర్వే చేపట్టాలని ఆదేశిస్తూ సీఎస్ శాంతికుమారి ఈ నెల 14న ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. సర్వే నిర్వహణకు ప్రణాళిక శాఖను నోడల్ డిపార్ట్మెంట్గా నియమించారు. అయితే, ఈ సర్వే ఫలితాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు నిర్ణయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది.
సోషల్ సర్వేలో ఎన్యూమరేటర్ల ఎంపిక కీలకంగా మారింది. గతంలో జన గణనకు టీచర్లు సేవలందించారు. తాజా సర్వేకు అంగన్వాడీ టీచర్లు లేదా నిరుద్యోగులను ఎన్యూమరేటర్లుగా తీసుకోవాలని చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే, కుటుంబాలకు సంబంధించిన కీలక విషయాలు రాబట్టాల్సి ఉన్నందున అనుభవజ్ఞులనే ఎన్యూమరేటర్లుగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఆర్థిక, ప్రణాళిక శాఖ సిబ్బందికి అనేక సర్వేలు నిర్వహించిన అనుభవం ఉండగా, ప్రస్తుతం ఆ శాఖను సిబ్బంది కొరత వేధిస్తున్నది. 1,180మంది మాత్రమే ఉన్నారని, మరో 200మంది సిబ్బంది (క్యాడర్‌స్ట్రెంత్) కోసం 10నెలల క్రితం ప్రతిపాదనలు పంపామని, ఆ ఫైల్ సీఎం పేషీలో పెండింగ్‌లో ఉన్నట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
ఎన్యూమరేటర్ల ఎంపిక పూర్తయితే వారికి సర్వేపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి సీఎం కే చంద్రశేఖర్‌రావు సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించాలని స్వయంగా ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో అందరూ సొంతూళ్లకు వెళ్లడంతో ఒక్కరోజులోనే సర్వే పూర్తయింది. కానీ, ప్రస్తుతం అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. అందుకే అన్ని అంశాలపై అధికారులు కూలంకషంగా చర్చిస్తున్నారు.