సిద్దిపేట ప్రతినిధి, అక్టోబర్ 17 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘గులాబీల జెండలే రామక్క’ పాటతో సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభ ఊర్రూతలూగింది. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇటీవల వచ్చిన ‘గులాబీల జెండలే రామక్క’ పాటను సింగర్ లక్ష్మమ్మ పాడడంతో సభా ప్రాంగణం మొత్తం ఊగిపోయింది. ఇదే పాటను సిద్దిపేట అభివృద్ధికి అన్వయించి పాడగా మంత్రి హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఆడిపాడారు. రామక్క పాట బృందాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు.
తెలంగాణలో నేడు ఏ నోట విన్నా ‘గులాబీల జెండలే రామక్క’ పాటనే వినిపిస్తున్నది. అందరూ ‘నడువు నడవే రామక్కా.. కలిసి నడుము కట్టవే రామక్కా.. గులాబీల జెండలమ్మ’ అని పాడుతూ స్టెప్పులేస్తున్నారు. ఈ పాటను జానపద కళాకారిణి కొమ్ము లక్ష్మమ్మ ఆలపించారు. కల్యాణ్ కీస్ సంగీతాన్ని సమకూర్చగా.. బీఆర్ఎస్ పార్టీ ఈ పాటను ఇటీవల విడుదల చేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నది. సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించిన తీరు.. అభివృద్ధి, సంక్షేమానికి పదేండ్లలో చేసిన కృషిని పల్లెపదాల్లో వివరిస్తూ.. కారు గుర్తును గుర్తుంచుకో అని లక్ష్మమ్మ పాడిన పాటకు జనాలనుంచి భారీ స్పందన వస్తున్నది. తెలంగాణ ఆడబిడ్డలు కూడా ఈ పాటపై బతుకమ్మ ఆడుతూ ఆనందంగా పాదం కలుపుతున్నారు.