రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్ల జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది ఆవునూరి రమాకాంత్‌రావు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ విజయానికి తనవంతు కృషి చేస్తానని రమాకాంత్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో పైకి కనిపించేది సిద్ధాంతం.. లోపలన్నీ గ్రూపు రాజకీయాలేనని రమాకాంత్‌రావు విమర్శించారు. అంతకుముందు సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి నాయకత్వాన్ని నమ్ముకుని బీజేపీలో చేరామని, ఇప్పుడు తమకు అన్యాయం జరిగితే నోరుమెదపలేదడం లేదని ఎంపీ సంజయ్‌పై మండిపడ్డారు. స్థానిక కార్యకర్తలు, నాయకులతో చర్చికుండా నర్సంపేటకు చెందిన రాణిరుద్రమకు సిరిసిల్ల టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రాణిరుద్రమకు సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఇస్తున్న విషయం తమకు తెలిపితే సహకరించేవాళ్లమని చెప్పారు.
బీజేపీని నమ్మి నాలుగున్నరేండ్ల కింద పార్టీలో చేరానని, 25 ఏండ్ల తన న్యాయవాద వృత్తి, భార్యాపిల్లలను పక్కనపెట్టి పార్టీ ఎదుగుదల కోసం కష్టపడ్డానని, అయినా.. ఫలితం దక్కలేదని వాపోయారు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై మనస్తాపంతో బీజేపీకి, కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌కి పంపించినట్టు తెలిపారు.