హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.2లక్షల కోట్లు కేటాయించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారామ్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు బీసీ సంఘం నేతలతో కలిసి ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బీసీల ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగబద్ధ సంస్థగా కమిషన్‌కు గుర్తింపునిచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సత్యం, మురళి, సురేశ్, కిరణ్, శివ, ఉదయ్ పాల్గొన్నారు.