చెన్నూర్ టౌన్, జూలై 13 : మంచిర్యాల జిల్లాలో పలు భూ వివాదాలతోపాటు ఇతర గొడవల్లో నమోదైన కేసుల్లో నిందితురాలైన ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) నాయకురాలు మద్దెల భవానిపై శనివారం రౌడీ షీట్ తెరిచినట్టు చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన మద్దెల భవాని కొన్నేండ్లుగా పలు భూములు, ఇతర వివాదాల్లో తలదూర్చి గొడవలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు.
ఈ మేరకు ఆమెపై చెన్నూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 7, కోటపల్లి పరిధిలో ఒక కేసులు నమోదైనట్టు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమెపై రౌడీ షీట్ తెరిచినట్టు పేర్కొన్నారు. ఇప్పటి నుంచి ఆమె కదలికలపై నిత్యం నిఘా ఉంటుందని, ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ భూ వివాదాల్లో తలదూరిస్తే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లాలో మహిళపై రౌడీషీట్ ఓపెన్ చేయడం ఇదే మొదటి సారి అని తెలిపారు. కాగా మద్దెల భవానికి ప్రగతి శీల మహిళా సంఘంతో ఎలాంటి సంబంధం లేదని పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ స్పష్టంచేశారు. మహిళల హక్కుల కోసం పోరాడుతున్న తమ సంఘం పేరుతో భవానీ అవినీతి అక్రమ దందాలను చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.