హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచి.. సంక్షోభం నుంచి రైతులను బయటపడేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్ చేశారు. మంగళవారం వైవీ కృష్ణారావు భవన్లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పశ్యపద్మ మాట్లాడుతూ రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్తున్నాయని, కానీ ఆచరణలో సత్యదూరమని విమర్శించారు.
వ్యవసాయ నిపుణులు దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పంట పెట్టుబడి పెరిగి.. గిట్టుబాటు ధర రాకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకునిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి.. విత్తన, ఎరువుల కల్తీని అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.