హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి నీట్ రద్దు కోసం ఏకగ్రీవ తీర్మాణాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నీట్‌ను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం దేశానికే ఆదర్శనీయంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ పరీక్షపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. మెడికల్ కాలేజీల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపును ఇవ్వాలని, గతంలో మాదిరిగా ఎంసెట్ ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఆయన కోరారు. రాష్ట్రాల విన్నపాలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పడితే సుప్రీంను ఆశ్రయించి, రాష్ట్రాలు తమ హకులను సాధించుకోవాలని వినోద్‌కుమార్ సూచించారు.