హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సాగిస్తున్న జలదోపిడీపై బీఆర్ఎస్వీ జంగ్‌సైరన్ మోగించింది. ఏపీ చేస్తున్న నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు విద్యార్థిశక్తిని సమాయత్తం చేస్తున్నది. తెలంగాణభవన్‌లో ఇటీవల బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎంపీ బాల్క సుమన్ తదితరులు హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, యూనివర్సిటీల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 50 విద్యార్థి బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. రాష్ట్ర విభాగం, జిల్లా విభాగాల సమన్వయంతో ఎక్కడికక్కడ అన్ని విద్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది మీద అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జూనియర్, డిగ్రీ కాలేజీలు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ సహా 17 విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండలస్థాయి దాకా తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూనే గోదావరి నదిలో ఏపీ కొల్లగొడుతున్న నీటి వాటాను ఆధారసహితంగా వివరిస్తున్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేస్తున్న వైనాన్ని విద్యార్థులకు విడమరచి చెప్తున్నారు.
ప్రమాదాన్ని ముందే పసిగట్టి..
తెలంగాణకు నీటి విషయంలో జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగాన్ని అప్రమత్తం చేసి సమరశంఖం పూరించింది. ఎట్టిపరిస్థితుల్లో ఏపీ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించకుండా ఉండేందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి తేవాలని, అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్వీ శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది. తెలంగాణ హక్కుల పరిరక్షణ, ప్రజల ప్రయోజనాలే తమకు గీటురాయి అని, రాజకీయాలతో తమకు సంబంధంలేదని బీఆర్ఎస్వీ స్పష్టంచేస్తున్నది.
బీఆర్ఎస్వీ కార్యాచరణకు విస్తృత స్పందన
బీఆర్ఎస్వీ చేపట్టిన కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో విస్తృత స్పందన కనిపిస్తున్నది. హైదరాబాద్‌తోపాటు ఏటూరునాగారం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం బీఆర్ఎస్వీ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జలసంఘం తదితర సంస్థల అనుమతులు లేకుండా, ఆపెక్స్కౌన్సిల్లో కనీసం చర్చ జరగకుండానే బనకచర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ఎట్లా నిర్మిస్తున్నదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారనే విషయాన్ని విద్యార్థులు గ్రహిస్తున్నారని బీఆర్ఎస్వీ నేతలు చెప్తున్నారు. బనకకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఏపీకి 200 టీఎంసీల నీటి హకు అదనంగా కలుగుతుందని, అప్పుడు తెలంగాణ నీటి వాటాలో కోత పడుతుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహిస్తున్నారు. రాష్ట్రం కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి నిజస్వరూపాన్ని ప్రతి విద్యార్థికి తెలిసేలా అవగాహన కల్పించటంతోపాటు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేదాకా విశ్రమించబోమని బీఆర్ఎస్వీ చెప్తున్నది. అందులో భాగంగానే ఈ నెలాఖరులో హైదరాబాద్‌లో భారీ విద్యార్థి సదస్సును నిర్వహించనున్నట్టు సూచనప్రాయంగా బీఆర్ఎస్వీ వెల్లడించింది.
తెలంగాణ భూమిపుత్రులుగా మా బాధ్యత
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశా నిర్దేశంతో ‘నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై విద్యార్థులుగా ఆనాడు అవగాహన చేసుకున్నాం. తెలంగాణ భూమిపుత్రులుగా నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాం. రాష్ర్టాన్ని సాధించాం. ఇవ్వాళ చంద్రబాబు జలదోపిడీకి రేవంత్‌రెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్న వైనాన్ని విద్యార్థిలోకానకి విడమరచి చెప్తాం. అది ఈ గడ్డ బిడ్డలుగా మా బాధ్యత. బనకచర్ల ప్రాజెక్టును విరమించుకునేలా అన్నిస్థాయిల్లో ఉద్యమిస్తాం.
– బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే
మరో ఉద్యమానికి శ్రీకారం
తెలంగాణ ద్రోహులంతా తెలంగాణకు అన్యాయం చేస్తున్న సమయంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కుకినపేనుల్లా పడి ఉన్న వాళ్లు ఇప్పుడు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే ఊరుకోం. విద్యార్థులుగా ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆటకట్టే దాకా ఉద్యమిస్తాం. బనచర్లను విరమించుకొనే దాకా ఒత్తిడి తెస్తాం.
– గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు