నెక్కొండ, ఏప్రిల్ 8: తోడికోడళ్ల గొడవ ఒకరి ప్రాణాన్ని బలిగొన్నది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాకలో శనివారం జరిగిన ఈ ఘటనలో తాళ్ల కళమ్మ(70) మృతి చెందింది. పత్తిపాక గ్రామానికి చెందిన తాళ్ల లచ్చమ్మ, తాళ్ల కళమ్మ తోడికోడళ్లు. తరచూ చిన్న విషయాలకే గొడవపడుతుంటారు.
శనివారం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ సమయంలో తాళ్ల లచ్చమ్మ తన చేతికర్రతో కళమ్మ తలపై కొట్టింది. తలకు బలమైన గాయమవడంతో కళమ్మను నెక్కొండలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలి కుమారుడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు నెక్కొండ ఇన్చార్జి ఎస్సై తోట మహేందర్ తెలిపారు.